మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
భవిష్యత్ తరాల మనుగడకు ప్రకృతి పరిరక్షణ అవసరం
వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ గణేష్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని వరంగల్ అదనపు కలెక్టర్ వై వి గణేష్ పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని లేబర్ కాలనీలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో గ్రీన్ ట్రై సిటీ, కడారి సేవా ఫౌండేషన్, చేయూత సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ గణేష్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల మానవ మనుగడకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. నాటిన మొక్కలను చెట్లుగా ఎదిగే వరకు బాధ్యతగా కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారందరితో వన ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ హార్టికల్చర్ ఆఫీసర్ ప్రశాంత్, రిటైర్డ్ డీఎఫ్ఓ పురుషోత్తం, చేయూత అధ్యక్షులు మామిడాల రమేష్ బాబు, ఉపాధ్యక్షులు కుందారపు రాజేందర్, సభ్యులు జి మెగరాజ్, దేవునూరి రాజు, ఎన్జీఓ మండల పరశురాములు, కడారి శ్రీనివాస్, స్థానిక నాయకులు జి రాజ్ కుమార్, ఆనందరావు, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది, ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది, అభ్యుదయ సంస్థ ప్రతినిధి భారతి తదితరులు పాల్గొన్నారు.

