అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి
జాప్యం చేస్తే, నాణ్యత లేకపోతే బిల్లుల్లో కోత కమిషనర్ టి వెంకన్న
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పూర్తయిన, కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాశీబుగ్గ సర్కిల్, పోతరాజుపల్లి, ఉర్సు, తోట మైదానం, గిర్మాజిపేట, చార్ బౌలి, లక్ష్మీపురం మార్కెట్ ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను, వరంగల్ చౌరస్తా వద్ద పైప్ లైన్ పనులను తనిఖీ చేశారు. అదేవిధంగా ఖాజీపేట సర్కిల్ పరిధిలోని బంధం చెరువు, ఖాజీపేట దర్గా సమీపంలో, పిస్తా హౌస్ ప్రాంతాల్లో చేపట్టిన పనులతో పాటు శాయంపేటలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను, ఉర్సు వద్ద నిర్మిస్తున్న యూపీహెచ్ సీ భవనాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే బిల్లుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం శాయంపేటలో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్వచ్ఛ ఆటో ప్రతిరోజూ చెత్త సేకరిస్తుందా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పరిశుభ్ర వాతావరణం కల్పించేలా పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. పర్యటనలో ఈఈలు సంజయ్ కుమార్, రవికుమార్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

