పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అర్హులైన ప్రతి పట్టభద్రుడి *ఓటు నమోదు చేయించాలి
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లిశ్రీనివాస్ రెడ్డి
కాకతీయ.నల్లబెల్లి : వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడమే లక్ష్యంగా నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఓరుగల్లు ఉద్యమ నాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గులాబీ జెండా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటే ధ్యేయంగా ముందుకు సాగిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి నల్లబెల్లి గడ్డ నుంచి మొదటి నుంచీ అండగా నిలిచిన ఉద్యమ సహచరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని గుర్తుచేశారు. కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి, ఓరుగల్లు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రతి ఎన్నికలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి మనతోనే ఉన్నారని, ఆయన లేకుండా నల్లబెల్లిలో సమావేశంలో మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలన్నదే పెద్ది సుదర్శన్ రెడ్డి చివరి ఆకాంక్ష అని, ఆ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నల్లబెల్లి మండలంలోని ప్రతి గ్రామంలో అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటరు నమోదు గడువు ముగియడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, ఇంకా నమోదు చేసుకోని పట్టభద్రులను గుర్తించి వెంటనే నమోదు చేయించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, వైద్యులు, ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇతర పట్టభద్రులను నేరుగా సంప్రదించి ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా సమన్వయంతో, పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

