గ్రేటర్ ప్రెస్‌క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించండి!
అవసరమైతే అడహాక్ కమిటీ ఏర్పాటు చేయాలి
బైలా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కార్యవర్గం
రెండేళ్ల పదవీకాలం ముగిసినా ఎన్నికల ఊసే లేదు
సభ్యుల హక్కులకు భంగం.. నిర్వహణపై అనుమానాలు
హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు టీడీఎంయూ ఆధ్వర్యంలో వినతిపత్రాలు
కాకతీయ,హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌కు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ (టీడీఎంయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్‌పేయి, సత్యశారదలను యూనియన్ నేతలు కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రెస్‌క్లబ్ బైలా ప్రకారం కార్యవర్గం పదవీకాలం రెండేళ్లు మాత్రమేనని, గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడం సభ్యుల హక్కులకు విఘాతమని పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌కు 2022 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయని, ఈ లెక్కన 2024 డిసెంబర్‌తోనే ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ముగిసిందని కలెక్టర్లకు వివరించారు. అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా కార్యవర్గం కొనసాగుతుండటంపై సభ్యుల్లో ఆందోళన నెలకొందన్నారు. క్లబ్ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలంటే వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.

అర్హులైన సభ్యులతో ఓటర్ల జాబితా రూపొందించాలి
ఎన్నికల జాప్యంపై ప్రస్తుత కార్యవర్గం నుంచి వివరణ తీసుకోవాలని, అర్హులైన సభ్యులతో ఓటర్ల జాబితా రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే బైలా నిబంధనల ప్రకారం అడహాక్ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అరెళ్లి కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన నాగరాజు, కోశాధికారి పల్లె రవి వంశీ మోహన్, ఉపాధ్యక్షుడు మెహన్ రావు, సహాయ కార్యదర్శి బూర నగేష్, కార్యవర్గ సభ్యులు సలెందర్ రవీందర్, ముల్క రవి, దాసరి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

