గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుల వెల్లువ!
కమిషనర్ ఎదుటే ప్రజల గోడు..
116 అర్జీలతో బల్దియా సమస్యల చిట్టా
ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కమిషనర్ ఎదుట తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పార్కుల నిర్వహణ, ఆక్రమణలు తదితర అంశాలపై మొత్తం 116 ఫిర్యాదులు అందాయి. 26వ డివిజన్ లక్ష్మీపురంలో ప్రభుత్వ కాలువను మూసివేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. 56వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో పన్నులు చెల్లిస్తున్నా నాలుగేళ్లుగా తాగునీరు రావడం లేదని వాపోయారు. 21వ డివిజన్ ఎల్బీనగర్లో 20 అడుగుల రహదారికి గేటు అడ్డుగా నిర్మించారని, 64వ డివిజన్ టేకులగూడెంలో సీసీ రోడ్డుపై మెట్లు, కాలువ పూడ్చివేతపై రెండోసారి ఫిర్యాదు అందింది. 27వ డివిజన్ గిర్రాజిపేటలో 60 ఏళ్లుగా రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. లాల్జీ దొడ్డిలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ తొలగింపుతో 15 ఇళ్లు చీకట్లో మగ్గుతున్నాయని 11 కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. గుడిమళ్ల కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ స్థలం ఆక్రమణతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని 11 మంది జ్యువెలరీ వ్యాపారులు విన్నవించారు. లేబర్ కాలనీలో దుర్గమ్మ చెరువు పార్కు చెత్తకుప్పగా మారిందని, కృష్ణానగర్లో డ్రైనేజీ లీకేజీతో రెండేళ్లుగా ఇళ్ల గోడల్లోకి మురుగునీరు వస్తోందని ఫిర్యాదులు అందాయి.
ఫైళ్లకే పరిమితమవుతాయా.. చర్యలు తీసుకుంటారా?
ఒకేరోజు 116 ఫిర్యాదులు రావడం, కొన్ని సమస్యలపై రెండోసారి అర్జీలు సమర్పించాల్సి రావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కమిషనర్ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తారా.. లేక అర్జీలు ఫైళ్లకే పరిమితమవుతాయా అన్నది వేచి చూడాలి.

