మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలుశ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఫల పంచామృత అభిషేకాలు
కాకతీయ, హన్మకొండ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ మెట్టుగుట్టపై నాగుల చవితి వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. కుజ, కాలసర్ప దోషాలతో బాధపడుతున్న సర్వజనుల సంక్షేమం, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఫల పంచామృతాలతో అభిషేకం చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శివకేశవులకు ఆకాశ దీపోత్సవం నిర్వహించారు. శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామికి ప్రదోషకాల రుద్రాభిషేకం, ప్రత్యేక అలంకరణ, నీరాజన మంత్రపుష్పం, హారతులు, పవళింపు సేవ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. సత్యనారాయణ, శివాలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పి. రఘుచందర్ ఆధ్వర్యంలో అర్చకులు రాగిచేడు అభిలాష్ శర్మ, పరాశరం విష్ణువర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మకర్తలు భోగి కేదారి, బైరి రాజు, దండిగం శ్రీనివాస్, రొడ్డ దయాకర్, వస్కుల ఉమ, మాడిశెట్టి జ్ఞానేశ్వరి తదితరులు, భక్తులు పాల్గొన్నారు.

