భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
పోలీస్ స్టేషన్ రికార్డులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
కాకతీయ, హన్మకొండ : ఐనవోలు మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన పోలీసు సేవలు అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఆదేశించారు. శుక్రవారం ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఘన స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో సీపీ కొబ్బరి మొక్క నాటారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల వివరాలు, రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది విధులు, పనితీరుపై ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల మనోభావాలు, ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడాలని, వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ సంతోష్, ఐనవోలు ఎస్ఐ అశోక్, సంగెం ఎస్ఐ వంశీకృష్ణ, పర్వతగిరి ఎస్ఐ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

