జన చైతన్య సభతో గులాబీ శంఖారావం!
22న వరంగల్ నుంచి మున్సిపల్ ఎన్నికల సమరానికి సన్నాహాలు
కేటీఆర్ సమక్షంలో భారీగా చేరికలు
కాంగ్రెస్ హామీలన్నీ మోసాలే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
అభయహస్తం కాస్తా భస్మాసుర హస్తంగా మారింది
మూడేళ్ల పాలనలో తెలంగాణ 30 ఏళ్లు వెనక్కి
గులాబీ జెండా ఎగరడం ఖాయం
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం, అరూరి, చల్లా, నన్నపునేని
కాకతీయ, హన్మకొండ : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను చాటడంతోపాటు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు ఈ నెల 22న వరంగల్‌లో జన చైతన్య సభ నిర్వహిస్తున్నామని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. ఈ సభకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నారని, ఆయన సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని వెల్లడించారు. హన్మకొండలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్ మీడియాతో మాట్లాడారు. జన చైతన్య సభతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరిస్తామని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించారని, జనవరిలో హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లతోపాటు వరంగల్, ఇతర మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపుబాటలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. జన చైతన్య సభలో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని వెల్లడించారు.
సమ్మక్క బ్యారేజీపై కాంగ్రెస్ ప్రచారమేంటి?
సమ్మక్క బ్యారేజీ నిర్మించి మూడేళ్లు పూర్తయిందని, తమ ప్రభుత్వ హయాంలోనే దాన్ని నిర్మించామని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. దేవాదుల ప్రాజెక్టుకు నిరంతరంగా నీరు అందించాలనే ఉద్దేశంతో బ్యారేజీ నిర్మించామని, దాని ద్వారా వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనే ప్రాజెక్టు పూర్తయిందని పేర్కొందని చెప్పారు. అలాంటప్పుడు 33 ఎకరాల భూసేకరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కలవడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అభయహస్తం హామీలకు మూడేళ్లు పూర్తయినా ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. అభయహస్తంతోపాటు 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వంపై విరక్తి పెరిగిందని, ప్రజలు కేసీఆర్, బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి కేటీఆర్ సమక్షంలో చేరికలు జరుగుతున్నాయని, ఈ నెల 22న కేడీసీ మైదానంలో నిర్వహించే జన చైతన్య సభకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు డెత్ డిక్లరేషన్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటున్నారని, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలే తమ పార్టీ మనుగడపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వర్గాన్ని పలకరించినా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ గెలవదని చెప్పారని పేర్కొన్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే జన చైతన్య సభ నిర్వహిస్తున్నామని, బీఆర్‌ఎస్‌లో చేరేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అభయహస్తం హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు వాటిని విస్మరించారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ జాతీయ నాయకులు ఇచ్చిన అభయహస్తం హామీలు భస్మాసుర హస్తంగా మారాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో తెలంగాణ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. గ్రేటర్ వరంగల్ సహా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని, పాలకవర్గాలు లేక అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. కేసీఆర్ పాలనతోనే తెలంగాణకు పూర్వ వైభవం వస్తుందని, అభయహస్తాన్ని భస్మాసుర హస్తంగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేస్తారని పేర్కొన్నారు.
ఎన్నికల శంఖారావం పూరిస్తాం
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్‌ఎస్‌లోకి చేరికల పరంపర కొనసాగుతోందని, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 22న జరిగే జన చైతన్య సభ ద్వారా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు శంఖారావం పూరిస్తామని, కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

