అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు
విద్యార్థుల్లో పోషకాహార లోపం తగ్గుదల.. పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతం
కాకతీయ,శంకరపట్నం:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెంపొందించేందుకు అల్పాహార పథకం ఎంతగానో దోహదపడుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో హరే కృష్ణ మూవ్మెంట్ (అక్షయ పాత్ర) ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. మిల్లెట్, రాగిజావ, పాలు వంటి పోషకాహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో రక్తహీనత, బలహీనత తగ్గడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని తెలిపారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటూ చదువుపై ఏకాగ్రత పెంచుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమం కోసం అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అక్షయ పాత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ మచ్చ గీత, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాశ్, ఎంపీడీవో అనిత, తహసీల్దార్ సురేఖ, పీసీసీ సభ్యుడు, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్లు కీసర సంపత్, గోపగోని బస్వయ్య గౌడ్, సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, గాజుల మహేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

