సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి
రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు
ట్రాఫిక్ నియమాల పాటింపుతోనే ప్రమాదాల నివారణ
యువత, డ్రైవర్లలో చైతన్యం పెంపే లక్ష్యం
అడిషనల్ డీజీపీ చారు సిన్హా
కాకతీయ, హనుమకొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా తెలిపారు. హనుమకొండ జిల్లా భీమారం సమీపంలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో వరంగల్ పోలీస్ కమిషనరేట్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చారు సిన్హా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల కారణాలు, మద్యం మత్తులో డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై వీడియోలు, స్కిట్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రుత్విక్ అనే బాలుడు హెల్మెట్ ధరించకపోవడంతో తన తండ్రి ప్రమాదంలో మరణించిన ఘటనను వివరించి అందరిని ఆలోచింప జేశాడు. చారు సిన్హా మాట్లాడుతూ.. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల ప్రాణ నష్టం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై తమ అవగాహనను పంచుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ నెల 13 నుండి 18 వరకు వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి డ్రైవర్లకు కళ్లద్దాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల బాధ్యత కీలకమని, విద్యార్థుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా రవాణాశాఖ అధికారి సురేష్ రెడ్డి ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధికారులు, డ్రైవర్లు, ప్రజలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


