పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు చెక్ అవసరం
వరంగల్ కలెక్టర్ సత్య శారద
ఓ సిటి పార్కులో అవగాహన కార్యక్రమం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే భూమిని రక్షించగలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ఓసిటి పార్కు వేదికగా ఆదివారం ఉదయం నిర్వహించిన ప్లాస్టిక్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలను వివరించారు. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూమిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుందని, దీని కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా జనపనార, కాటన్ సంచులను ఉపయోగించాలని సూచించారు. పర్యావరణ మార్పులపై అవగాహన కల్పించడంలో విద్యార్థులు, యువత ముందుండాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత ప్లాస్టిక్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్లాస్టిక్ రహిత ప్రతిజ్ఞ
కార్యక్రమంలో భాగంగా పార్కుకు వచ్చిన సందర్శకులు, వాకర్స్, అధికారులతో కలిసి కలెక్టర్ ప్లాస్టిక్ రహిత వరంగల్ కోసం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పార్కు ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పర్యావరణ వేత్తలు, స్థానిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

