అంధకారంలో ఆటోనగర్!
కొన్ని రోజులుగా వెలగని వీధి దీపాలు
పట్టించుకోని వరంగల్ బల్దియా
రాత్రిపూట పర్యవేక్షణ కరువు
చీకట్లో మగ్గుతున్న పలు కాలనీలు
కాకతీయ, వరంగల్ : వరంగల్ నగరంలో ఆటోనగర్ నిత్యం రాత్రివేళ అంధకారంలో మగ్గుతోంది. వీధిదీపాలు వెలగకపోవడంతో ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా చీకట్లు అలుముకుంటున్నాయి. సాధారణంగా ఆటోనగర్ లో వాహనాల రిపేరింగ్ షాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ షాపులను ఆనుకుని కొన్ని కాలనీలు కూడా ఉన్నాయి. ఈ కాలనీల ప్రజలు ఈ మార్గం గుండానే ఇళ్లను చేరుకుంటారు. కొన్ని రోజులుగా వీధిదీపాలు వెలగకపోవడంతో పోచమ్మమైదాన్ నుంచి దేశాయిపేట డౌన్ మీదుగా చుట్టూ తిరిగి ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆటోనగర్ లో కొన్ని షాపులు రాత్రి 8, 9 గంటలవరకు పని చేస్తుంటాయి. అయితే, వీధిదీపాలు వెలగకపోవడంతో షాపులు త్వరగా మూసివేయాల్సి వస్తోందని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదు, ఇదే మార్గంలో ఎంజీఎం కంటి దవాఖాన, కాళోజీ యూనివర్సిటీ ఉన్నాయి. అంతేకాదు, దేశాయిపేటకు చేరుకోవడానికి ఈ మార్గం షార్ట్ కట్. వీధిదీపాలు వెలగకపోవడంతో ఈ మార్గం గుండా నిత్యం ప్రయాణించే వారు పోచమ్మమైదాన్ సెంటర్ ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించవలసి వస్తోందని వాహనదారులు పేర్కొంటున్నారు.
బల్దియా వింగ్ ఏం చేస్తున్నట్టు?
ఒక ఏరియాలో ఒకటీ, రెండు వీధి దీపాలు వెలగకపోతే.. ఆ లైట్లలో లోపం ఉందనుకోవచ్చు. కానీ, వీధి వీధంతా లైట్లు వెలగకపోతే.. అన్ని లైట్లు ఒకేసారి దెబ్బతింటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. విద్యుత్ సరఫరాలో లోపమా? మరేదైనా కారణమా? అని పరిశీలించడంలో బల్దియా వింగ్ విఫలమైందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు రాత్రి వేళల్లో కూడా కాలనీలను సందర్శించి.. వీధి దీపాలు లోటుపాట్లను పరిశీలించి.. పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు.

