ప్రజా సమస్యల పరిష్కారానికే ‘ప్రజా దర్బార్’
సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తాం
పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ తప్పదు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
మల్లూరు, మంగపేట గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి
రూ. 2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
కాకతీయ, మంగపేట : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకే గ్రామాల్లో ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించి, ప్రజలకు చేరువగా ఉండటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మంగపేట మండలంలోని మల్లూరు, మంగపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజల వద్దకే పాలన..
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి మంత్రి సీతక్క మల్లూరు, మంగపేట గ్రామాల్లో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కమలాపురం, చుంచుపల్లి, నర్సింహ సాగర్ సహా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల వారు కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే నేరుగా గ్రామాల్లోకే వచ్చి వారి సమస్యలు వింటున్నామని చెప్పారు. అభివృద్ధి పనులపై ప్రజలతో మమేకమై చర్చించుకోవడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఐటీడీఏ నిధులు రూ. 2 కోట్లతో చేపట్టనున్న బోర్ నర్సాపూర్ – గోదావరి ఫెర్రీ పాయింట్ రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
అధికారులకు కఠిన హెచ్చరికలు
ప్రజా దర్బార్ వేదికగా పంచాయతీ అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు. పంచాయతీ నిధులను తప్పుడు లెక్కలతో దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ వేటు తప్పదని స్పష్టం చేశారు. “ప్రతి రూపాయిని కేటాయించిన పనులకే ఖర్చు చేయాలి. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడటం, విద్యుత్ బిల్లులు చెల్లించడం వంటి అత్యవసర పనులకే ప్రాధాన్యత ఇవ్వాలి” అని సూచించారు. నిధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్ జి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ బద్రు నాయక్, ఇతర అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

