జేఎన్ఎస్లో రామప్ప ఈవెంట్స్ విజయవంతం
కాకతీయ, హనుమకొండ: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా రామప్ప డిఫెన్స్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఎంపిక ఈవెంట్స్ విజయవంతమయ్యాయి. ఇంటర్మీడియట్ చదువుతో పాటు ఆర్మీ శిక్షణ పొందాలనుకునే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు.
కళాశాల డైరెక్టర్ ఐలి కర్ణాకర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో విద్యార్థుల శారీరక సామర్థ్యాన్ని పరీక్షించారు. ఫిజికల్ కోచ్ కమల్ పర్యవేక్షణలో 1600 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్ వంటి వివిధ క్రీడా అంశాలను నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి రెండేళ్ల పాటు ఉచిత ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఆర్మీలో చేరడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణను అందించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
యువతకు సువర్ణావకాశం..
ఈ సందర్భంగా డైరెక్టర్ కర్ణాకర్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగంలో సేవ చేయాలనుకునే గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు ఇది ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకుండా, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు తోడ్పడతాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, వారి భవిష్యత్తుకు కళాశాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ పూర్ణ చందర్, జీ.కే మధు, సునిల్ కుమార్, పీడీ రాధాకృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

