మక్కల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
రైతులు ఇబ్బంది పడకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి
మద్దతు ధర చెల్లింపుల్లో ఆలస్యం కావొద్దు
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం
కాకతీయ, నర్సంపేట: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నర్సంపేట ప్రాంత మొక్కజొన్న కొనుగోళ్లు, నిల్వ సామర్థ్యంపై ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న సాగు ఆశాజనకంగా ఉందని, సుమారు 72 వేల ఎకరాల్లో సాగు చేయగా 2.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భారీగా వస్తున్న పంటకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మద్దతు ధర చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలన్నారు.
నిల్వలపై ప్రత్యేక శ్రద్ధ..
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాముల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, వర్షాల నేపథ్యంలో నాణ్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్క్‌ఫెడ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, అగ్రికల్చర్ జేడీ అనురాధ, డీసీఓ నీరజ, మార్క్‌ఫెడ్ డీఎం రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మరియు వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

