వర్ధన్నపేట మండల బీజేపీ అధ్యక్షుడిగా అడుప రాజు
నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షుడు గంట రవి
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట మండల నూతన అధ్యక్షుడిగా ఇల్లంద గ్రామానికి చెందిన అడుప రాజు నియామకమయ్యారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజును శాలువాతో సన్మానించి పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అడుప రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్ర పార్టీ నాయకత్వానికి మరియు జిల్లా అధ్యక్షుడు గంట రవికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో వర్ధన్నపేట మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాయపురం కుమారస్వామి, వర్ధన్నపేట బీజేపీ నాయకులు మైస రాము, ఇల్లంద శక్తి కేంద్రం ఇంచార్జ్ సట్ల అనిల్ గౌడ్, మూల రాము, సుల్తాన్ రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

