మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం
మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం
భూపాలపల్లిలో కానిస్టేబుల్‌గా సాదు సంగీత విధులు
ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యం..
కారణాలపై ఆరా తీస్తున్న మట్టేవాడ పోలీసులు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సాదు సంగీత మట్టేవాడ పరిధిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంగీత తన గదిలో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు సంగీత రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. తన మరణానికి గల కారణాలను అందులో వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ లేఖలోని పూర్తి వివరాలను పోలీసులు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తిగత కారణాలా.. వృత్తిపరమైన ఒత్తిళ్లా?
సంగీత ఆత్మహత్యకు గల కారణాలు వ్యక్తిగతమైనవా లేక వృత్తిపరమైన ఒత్తిళ్లా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేవలం 33 ఏళ్ల వయసులోనే ఆమె ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం తోటి ఉద్యోగుల్లో విషాదాన్ని నింపింది. సూసైడ్ నోట్‌లోని అంశాల ఆధారంగా కేసును అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామని మట్టేవాడ పోలీసులు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

