రూ.2.5 కోట్ల విలువైన హాష్ ఆయిల్ పట్టివేత
అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. నలుగురు నిందితుల అరెస్ట్
నిందితుల నుంచి 20 కిలోల గంజాయి లిక్విడ్ స్వాధీనం
ముంబైకి తరలిస్తుండగా వరంగల్ పోలీసుల ఆపరేషన్
వివరాలను వెల్లడించిన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారని, నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 2.5 కోట్ల రూపాయల విలువ గల 20 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హంటల్ సన్ను, హంటల్ సన్యాసి, కండెల చిన్నబాబు, కృష్ణా హంటల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు సన్ను తన గ్రామంలో గంజాయి సాగు చేసి విక్రయించేవాడని, అయితే అధిక ఆదాయం కోసం హాష్ ఆయిల్ తయారీకి మళ్లాడని పేర్కొన్నారు. పరారీలో ఉన్న ప్రధాన కుట్రదారుడు కిలో పాండు సూచనల మేరకు ప్రత్యేక పరికరంతో గంజాయి మొక్కల నుండి సుమారు 40 కిలోల హాష్ ఆయిల్ తయారు చేశారని వివరించారు. ఇందులో 20 కిలోలు పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోలను నిందితులు ఒక్కొక్కరు 5 కిలోల చొప్పున పంచుకుని ముంబైలో విక్రయించేందుకు ప్లాన్ చేశారని తెలిపారు.
అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల వలలో
ఈ నెల 19న తుని రైల్వే స్టేషన్ నుండి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ప్రారంభించిన నిందితులు, వరంగల్ వద్ద తనిఖీలు జరుగుతున్నాయనే అనుమానంతో రైలు దిగిపోయారని సీపీ తెలిపారు. అనంతరం ముంబై వెళ్లేందుకు బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. తనిఖీల్లో నిందితుల వద్ద హాష్ ఆయిల్ బయటపడిందని, పరారీలో ఉన్న పాండు కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సెంట్రల్ జోన్ డీసీవో దార కవిత, ఏసీవోలు, ఇన్‌స్పెక్టర్లు మరియు సిబ్బందిని కమిషనర్ అభినందించారు.

