స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం అమలు చేయాలి
ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్‌కు వినతి
కాకతీయ, నెల్లికుదురు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్కావెంజర్ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇసంపేల్లి సైదులు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 వేల మంది స్వచ్ఛ కార్మికులు పాఠశాలల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. వీరంతా తరగతి గదులు, మూత్రశాలల శుభ్రతతో పాటు పాఠశాల ప్రాంగణం నిర్వహణ, చెట్ల పెంపకం వంటి పనులను నిరంతరం చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అందరికీ సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
స్కావెంజర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని సైదులు కోరారు. కనీస వేతనాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. వీరి సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విప్ రామచంద్రు నాయక్‌ను కోరారు. దీనిపై విప్ స్పందిస్తూ.. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

