అధికారులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి
ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపైనే సర్కారు ప్రతిష్ట
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం కావాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల: ప్రభుత్వ అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలు అందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. బుధవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలోనూ, ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేయడంలోనూ క్షేత్రస్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. యంత్రాంగం చురుగ్గా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగుతాయని రేవూరి తెలిపారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.
సంక్షేమ పథకాలపై ప్రత్యేక శ్రద్ధ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. అలాగే సమాజానికి ముప్పుగా పరిణమించిన గంజాయి నిర్మూలనపై పోలీసు, ఎక్సైజ్ శాఖలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేసి పరకాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

