వేసవి వేళ రామసహాయం
44 గ్రామాల్లో తాగునీటి కష్టాలకు ఎంపీ రఘురాం రెడ్డి చెక్
రూ.35 లక్షల నిధులతో ప్రజల దాహార్తి తీర్చేందుకు చర్యలు
వారం రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
కాకతీయ, ఖమ్మం: వేసవి ఎండలు మండుతున్న వేళ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ముందడుగు వేశారు. ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.35 లక్షలు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల పరిధిలోని 44 గ్రామాల్లో రూ.35,20,000 వ్యయంతో కొత్తగా చేతిపంపులను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నీటి సమస్య తీవ్రంగా ఉన్న శివారు ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభం కావడంతో మహిళలు, వృద్ధులు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన అవస్థలు తప్పనున్నాయి.
సత్వరమే పనులు పూర్తి కావాలి
నిధులు మంజూరైన నేపథ్యంలో వారం రోజుల్లోనే పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ రఘురాం రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి ఎద్దడిని గుర్తించి తక్షణమే స్పందించిన ఎంపీకి స్థానిక సర్పంచ్ లు, వివిధ గ్రామాల ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సంక్షేమమే ధ్యేయంగా ఈ వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఎంపీ రఘురాం రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

