బది’లీలల’ బల్దియా!
ఆపద వస్తుందని అంతర్గత బదిలీలు
ఇద్దరి కోసం మరోసారి స్థానచలనాలు
ట్రాన్స్ఫర్ ల తీరుపై అధికారులు ఆగ్రహం ఇష్టారీతిగా బదిలీల తీరుపై అసహనం
కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ.. అవినీతి, అక్రమాలకు పుట్టినిల్లుగా మారిపోయిందనే విమర్శలు అనేకం ఉన్నాయి. తాజాగా, బల్దియాలో బదిలీల బాగోతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నెలల వ్యవధిలో రెండోసారి అంతర్గత బదిలీలు చేపట్టడం విమర్శలకు దారితీస్తోంది. బల్దియా పెద్దలకు కుడి భుజంగా మారిన ఒక్కరిద్దరిని రక్షించుకునేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్ని నెలల క్రితమే!
వరంగల్ మహానగర పాలక సంస్థలో కొన్ని నెలల క్రితమే అంతర్గత బదిలీలు చేపట్టారు. ఈ ప్రక్రియపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఐదేండ్లుగా ఒకే సెక్షన్లో పని చేస్తున్న ఉద్యోగిని బదిలీ చేయకపోవడంపై బల్దియాలో పెద్ద చర్చ కొనసాగింది. అంతేకాక, బల్దియా పెద్దలకు అనుకూలంగా ఉన్న వారిని కూడా కదిలించలేదనే వాదనలు కూడా ఉన్నాయి.
దాడులు జరుగుతాయనీ!
బల్దియాలో ఒక్కరిద్దరు అధికారులు అవినీతి కూపంలో చిక్కుకున్నారనే టాక్ నడుస్తోంది. వీరు బల్దియాకు చెందిన ఓ పెద్ద ప్రజాప్రతినిధికి కుడిభుజంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, సదరు అధికారుల అవినీతిపై ఏసీబీ దృష్టిపడినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా వారు పనిచేస్తున్న విభాగంలో ఏసీబీ దాడులు జరగొచ్చనే విషయం బల్దియా పెద్ద ప్రజాప్రతినిధికి తెలిసినట్లు సమాచారం. దీంతో దిద్దుబాటు చర్యలకు సదరు పెద్ద ప్రజాప్రతినిధి దిగినట్లు తెలుస్తోంది. సదరు విభాగంపై దాడులు నిర్వహిస్తే.. గుట్టు బయటపడుతుందేమోనన్న అనుమానంతో ఉన్నట్టుండి అంతర్గత బదిలీలకు తెరదీసినట్లు తెలుస్తోంది. ఆగమేఘాల మీద మరోసారి ట్రాన్స్ఫర్ ల ప్రక్రియ చేపట్టారు. సదరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఇతర విభాగాలకు మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం బల్దియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే, ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణల నేపథ్యంలో సదరు విభాగంలో దాడులు చేస్తారా? లేదా అందుకు బాధ్యులైన వారిని టార్గెట్ చేస్తారా? తెలియకుండానే చేపట్టిన బదిలీలు సదరు అవినీతి అధికారులను కాపాడగలవా? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఏసీబీ అధికారులు.. అవినీతికి బాధ్యులైన వారిపై దాడులు నిర్వహిస్తే.. పరిస్థితి ఏమిటనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అదీగాక, సదరు విభాగంలో తనిఖీలు నిర్వహించినా.. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో పనిచేసిన అధికారులనే బాధ్యులను చేసే అవకాశం కూడా లేకపోలేదని చర్చించుకుంటున్నారు. మరి.. ఏసీబీ దాడులు నిర్వహిస్తుందా? లేదా అనేది వేచిచూడాల్సిందే. దాదాపు రెండేళ్లుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా ఏసీబీ బల్దియా వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. మరో నెలలో పాలకవర్గం ముగుస్తున్న సమయంలో విజిలెన్స్ దాడులు నిర్వహిస్తుందా? లేదా? అనేది అనుమానమే అనే అభిప్రాయలు కూడా వెల్లడవుతున్నాయి.

