సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్స్ రికవరీ
మొబైల్ పోతే ‘సీఈఐఆర్’లో ఫిర్యాదు చేయాలి
25 చరవాణులను బాధితులకు అందజేసిన ఎస్పీ
కాకతీయ, ములుగు ప్రతినిధి : మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే కేంద్ర ప్రభుత్వ ‘సీఈఐఆర్’ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాధ్ సూచించారు. ములుగు ఐటీ కోర్ టీమ్ సహకారంతో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రికవరీ చేసిన 25 మొబైల్ ఫోన్లను గురువారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వెంకటాపూర్ పోలీసులు, ఐటీ కోర్ టీమ్ సమన్వయంతో పనిచేసి అతి తక్కువ సమయంలోనే పోయిన మొబైల్స్‌ను ట్రేస్ చేయడం అభినందనీయమన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది మిస్సింగ్ మొబైల్స్ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. ప్రజలు తమ వ్యక్తిగత వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ ఫోన్ పోతే ఆందోళన చెందకుండా వెంటనే ఆన్‌లైన్‌లో సిఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని ఎస్పీ కోరారు. దీనివల్ల ఫోన్ దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేయవచ్చని, అలాగే తిరిగి కనిపెట్టడం సులభతరమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ టీమ్ సభ్యులు, వెంకటాపూర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

