కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది
కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
కాకతీయ, హన్మకొండ: రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి, గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్లోని క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక జనాల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆరోపించారు. భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదేనని, కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీని గెలిపించాలని కోరారు.
కార్యకర్తలకు అండగా ఉంటా..
గ్రేటర్ వరంగల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, ప్రజలు మళ్లీ కారు గుర్తుకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

