ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ మృతి
*రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి మాజీ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు
కాకతీయ, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి మాజీ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి కారణంగా ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో బలవన్మరణాల వంటి నిర్ణయాలు తీసుకో వద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మృతుడి కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

