నర్సంపేటలో ఉద్రిక్తత
పరామర్శలకు వెళ్తున్న బీఆర్ ఎస్ నేతల అరెస్టు
నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రఘునాథపల్లి టోల్‌గోట్ వద్ద మాజీమంత్రి సబితా ఇంద్రెడ్డి, వినోద్ కుమార్, మాలోతు కవిత అరెస్టు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అరూరి రమేష్ గృహనిర్బంధం
ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే : ఎర్రబెల్లి ధ్వజం
మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
కాకతీయ, వరంగల్ బ్యూరో: నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసన సెగలు మిన్నంటాయి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో పరామర్శలకు కూడా అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోతు కవితలను రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు వారి వాహనాలను నిలిపివేసి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రఘునాథపల్లి సీఐ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు, హనుమకొండలోని తన నివాసం నుంచి నర్సంపేటకు బయలుదేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాంనగర్‌లోని ఎర్రబెల్లి నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించి, వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. నర్సంపేటలో ఆందోళన చేపట్టిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వ హత్యే: ఎర్రబెల్లి ఆగ్రహం
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “శంకర్ గౌడ్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని నమ్మించి మోసం చేసినందుకే ఈ పరిస్థితి దాపురించింది” అని ఆరోపించారు. ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోతే కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ముదురుతున్న ఆందోళన
శంకర్ గౌడ్ ఘటన తర్వాత మనస్తాపంతో మరో ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కార్మికుల్లో నెలకొన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నర్సంపేటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ తరహా ఆంక్షలు విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలు వ్యక్తమవుతుండటంతో రాజకీయ ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతమవుతుందని ఆర్టీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

