ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘దోస్తీ’ అడ్మిషన్లు షురూ
గ్రామీణ విద్యార్థులకు చేరువలో నాణ్యమైన విద్య
ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం
అత్యాధునిక వసతులు.. ఉపాధి కోర్సులే లక్ష్యం
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా కళాశాల బృందం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. విద్యార్థులకు ‘దోస్తీ’ (DOST) ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి. రేణుక తెలిపారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాన కూడళ్లలో గోడ పత్రికలు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న కోర్సులు ఇవే..
కళాశాలలో బీఏ (హెచ్ఈపీ, సీఏ), బీఎస్సీ (బీజెడ్సీ, ఎంపీసీ), బీకామ్ (సీఏ, ఏఈడీపీ) వంటి వైవిధ్యమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ వివరించారు. 2007-08 విద్యా సంవత్సరం నుంచి కాకతీయ యూనివర్సిటీ ఫలితాల్లో ఈ కళాశాల గ్రామీణ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తోందని ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ ఇక్కడ ప్రైవేటుకు దీటుగా వసతులు ఉన్నాయని అధ్యాపకులు తెలిపారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా పీజీ, బీఈడీ, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇక్కడ ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నట్లు అధ్యాపకులు జీవవేణి, జ్యోతి, ఫాతిమా తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెల్ ద్వారా ప్లేస్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వ స్కాలర్షిప్ వర్తిస్తుందని, గ్రామీణ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రవేశాల కోసం 8099701289, 9491317887 నంబర్లను సంప్రదించవచ్చు.

