ఎండిన చెట్ల తొలగింపు..
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వర్షాకాలం దృష్ట్యా ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు చేపట్టారు. సర్పంచ్ శ్రీమతి కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు, ఉప సర్పంచ్ పర్వతాల ఎల్లయ్య సూచనలతో 7వ వార్డులో ప్రమాదకరంగా ఉన్న ఎండిన చెట్లను ఆదివారం తొలగించారు. వార్డు సభ్యుడు మాదరి మధు స్వయంగా ఈ పనులను పర్యవేక్షించారు. 7వ వార్డు మెయిన్ రోడ్డు నుంచి రామన్నగూడెం రోడ్డు వరకు రహదారికి ఇరువైపులా ఎండిపోయి కూలిపోయే స్థితిలో ఉన్న చెట్లను సిబ్బంది తొలగించారు. వర్షాకాలంలో ఈ చెట్లు అకస్మాత్తుగా కూలి వాహనదారులు, బాటసారులపై పడే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మధు తెలిపారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులను వేగంగా పూర్తి చేశారు.
వార్డులో పరిశుభ్రతతో పాటు ప్రజా భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు స్థానిక నేతలు పేర్కొన్నారు. ముందస్తుగా స్పందించి ప్రమాదకర చెట్లను తొలగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు ఎంపల్లి రాజు, 15వ వార్డు సభ్యుడు నాగవత్ కిరణ్, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

