వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు
భారీగా తరలివచ్చిన భక్తులు.. అన్నప్రసాద వితరణ
కాకతీయ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ఆరాధన మహోత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడితో నిండిపోయాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తుల కోసం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. సుమారు 1500 మందికి పైగా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు గాదె శంకరాచారి, లింగాచారి, కందుకూరి సుధాకర్, రమేష్, బ్రహ్మం, నరేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

