ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
రైతులు అధైర్య పడొద్దు.. దళారులను నమ్మి మోసపోవద్దు..
మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి
కాకతీయ, దుగ్గొండి: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం మండలంలోని గిర్నిబావి-మందపల్లి రహదారిలో తాడిచెట్ల వనం సమీపంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు సబ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 గిట్టుబాటు ధర కల్పిస్తోందని, రైతులు మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతులు తమ పంటను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టి, శుభ్రం చేసి కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, త్వరితగతిన తూకాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రామారావు, దంజ్య నాయక్, మహ్మదాపురం పీఏసీఎస్ సీఈఓ ముద్రబోయిన రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ పాల్గొన్నారు. అలాగే సర్పంచులు బండారి రమేష్, బుర్రి రాంబాబు, అల్లాటి ప్రభు, నాయకులు ఓలిగే నర్సింగ రావు, మట్ట రాజు, బండారి ప్రకాష్, బూర హేమచందర్ గౌడ్, కూరతోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.

