నల్లబెల్లిలో గులాబీ పండగ
ఘనంగా బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గ్రామగ్రామాన రెపరెపలాడిన పార్టీ జెండాలు
కాకతీయ, నల్లబెల్లి: తెలంగాణ అస్తిత్వ పోరాటానికి వేదికగా నిలిచిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం నల్లబెల్లి మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జెండా ఆవిష్కరణలు చేశారు. నల్లబెల్లి బస్టాండ్ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, నినాదాలతో హోరెత్తించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిరంతరం ప్రజాసేవలో ఉంటామని ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డీజే పాటలు, జై తెలంగాణ నినాదాల మధ్య మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ర్యాలీలు, జెండా ఆవిష్కరణలతో మండలంలోని గ్రామాలు గులాబీమయంగా మారాయి. ఈ వేడుకల్లో మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

