చెన్నారావుపేటలో బీఆర్‌ఎస్ ధర్నా
మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం
గోనె సంచుల కొరతతో అన్నదాతల ఇబ్బందులు
కాకతీయ, చెన్నారావుపేట: మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, గోనె సంచుల కొరతను నిరసిస్తూ సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 11న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా, నేటికీ కొనుగోలు ప్రక్రియ గాడిలో పడలేదని ధ్వజమెత్తారు. కేంద్రాల్లో కాంటా వేయడంలో జాప్యం జరుగుతుండటంతో మొక్కజొన్న గుట్టలు పేరుకుపోతున్నాయని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్న, ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్ ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల సిఫార్సు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, సాధారణ రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గోనె సంచులు లేవని చెప్పడమే కాకుండా, రైతులనే బయట కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్పడం అన్యాయమని అన్నారు. బస్తాకు రూ.15 ఇస్తామంటూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతున్నారని, ఒకవేళ పంట తడిస్తే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని.. తక్షణమే స్పందించకపోతే రైతులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

