ఏజెన్సీలో ఆగని భూదందా..
1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్న గిరిజనేతరులు
మణుగూరు, పినపాకలో గిరిజనుల భూముల్లో ఆక్రమణలు
మెడికల్ షాపు యజమానికి 15 ఇళ్లు ఎలా వచ్చాయి?
: తుడుం దెబ్బ నిలదీత
అధికారులు స్పందించకుంటే ఉద్యమం తప్పదంటూ అలెంకోటి హెచ్చరిక
కాకతీయ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల భూములకు రక్షణగా ఉన్న చట్టాలు నామమాత్రంగా మారుతున్నాయి. మణుగూరు, పినపాక మండలాల్లో గిరిజనేతరులు 1/70 చట్టాన్ని తుంగలో తొక్కి ఆదివాసీల భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అలెంకోటి తీవ్రంగా ఆరోపించారు. సోమవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుతున్న భూదందాలను ఎండగట్టారు. మణుగూరు ప్రాంతంలో గిరిజనేతరుల ప్రభావం పెరిగి ఆదివాసీల సామాజిక, ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయని అలెంకోటి ఆవేదన వ్యక్తం చేశారు. “మణుగూరులోని రామా మెడికల్ యజమాని పేరుతో ఏకంగా 15కి పైగా ఇళ్లను నిర్మించారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం ఇది సాధ్యమేనా?” అని ఆయన ప్రశ్నించారు. ఆదివాసీల నుంచి ఇళ్లను కిరాయికి తీసుకుని, తర్వాత వారిని బెదిరించి ఖాళీ చేయించడం వంటి అక్రమాలకు గిరిజనేతరులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సొంత భూముల్లో ఇళ్లు కట్టుకునే ఆదివాసీలను సైతం భయభ్రాంతులకు గురిచేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను
ప్రభుత్వ భూములు, ఆదివాసీ భూములే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ వెంచర్లు వేస్తూ భారీగా భూదందాలకు పాల్పడుతున్నారని అలెంకోటి ఆరోపించారు. 1/70 చట్టం ప్రకారం గిరిజన భూములను గిరిజనేతరులు కొనడం, ఆక్రమించడం శిక్షార్హమని తెలిసినా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయని విమర్శించారు. భూ సర్వేలు, రికార్డుల నిర్వహణలో పారదర్శకత కరువైందని ధ్వజమెత్తారు.
పోరాటమే మార్గం..
గత మూడు దశాబ్దాలుగా తుడుం దెబ్బ ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందని, జైలు శిక్షలను సైతం లెక్కచేయలేదని అలెంకోటి గుర్తుచేశారు. “రాజకీయ నాయకుల అబద్ధపు హామీలను నమ్మి మోసపోవద్దు. చట్టాలు, జీవోలే మనకు ఆయుధాలు. ఆదివాసీలంతా ఐక్యమై తమ భూములను రక్షించుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే, బాధితులతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

