సీఐ కిషన్‌కు ‘ఈగల్ టీమ్’ పురస్కారం
పాఠశాలల వద్ద పొగాకు విక్రయాలపై ఉక్కుపాదం
అవార్డు అందజేసిన సీపీ సన్‌ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ: పాఠశాలల సమీపంలో విద్యార్థులకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్న మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్‌ను తెలంగాణ పోలీస్ శాఖ ‘ఈగల్ టీమ్’ విశిష్ట పురస్కారంతో సత్కరించింది. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ చేతుల మీదుగా ఆయన నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మడికొండ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పరిసరాల్లో ఇన్‌స్పెక్టర్ కిషన్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న 16 మందిని గుర్తించి, వారిపై కోట్పా చట్టంతో పాటు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల ఈ కఠిన చర్యలతో విద్యాసంస్థల పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా మారాయి.
మార్గదర్శకత్వంతోనే సాధ్యం..
పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు, సీపీ సన్‌ప్రీత్ సింగ్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామని తెలిపారు. డీసీపీ దార కవిత, ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి సూచనలతో విద్యార్థులను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు చేపట్టిన ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

