వడ్ల కొనుగోలులో ప్రభుత్వం విఫలం
దళారులకు కొమ్ముకాస్తున్న రేవంత్ సర్కార్
ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షలు ఫోటోలకే పరిమితం
మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ధ్వజం
ఫిరంగిగడ్డ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలపై రైతుల నుంచి ఆరా
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను గాలికొదిలేసిందని, అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ధ్వజమెత్తారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని ఫిరంగిగడ్డ గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఆయన.. ప్రభుత్వం తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్కెటింగ్, గోదాము, రవాణా విభాగాల మధ్య కనీస సమన్వయం లేకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని అరూరి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా పటిష్ట చర్యలు తీసుకుందని, ప్రస్తుత ప్రభుత్వం పాత కేంద్రాలను కూడా సరిగ్గా నిర్వహించలేకపోతోందని మండిపడ్డారు. మక్కల కొనుగోలు కేంద్రాలను నిలిపివేసి రైతులకు మద్దతు ధర అందకుండా చేస్తూ.. ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు.

సమీక్షలు ఫోటోలకే పరిమితం..
స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ మరియు ఇతర అధికారులు కేవలం ఫోటోల కోసం నామమాత్రపు సమీక్షలు చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని అరూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ మహిళా సంఘాలు, పీఏసీఎస్, ఎఫ్‌పీఓల ద్వారా కొనుగోలు కేంద్రాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలును వేగవంతం చేసి రైతులకు వెంటనే చెల్లింపులు జరపాలన్నారు. ప్రభుత్వం తన ఉదాసీన వైఖరిని వీడకపోతే భవిష్యత్తులో రైతాంగంతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

