వైభవంగా వేణుగోపాల స్వామి రథోత్సవం
కనులపండువగా స్వామివారి గరుడ సేవ
భారీగా తరలివచ్చిన భక్తులు.. మొక్కుల సమర్పణ
కాకతీయ, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. గ్రామంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. గత సోమవారం స్వామివారి కళ్యాణోత్సవంతో ప్రారంభమైన వేడుకలు.. శనివారం నిర్వహించిన గరుడ సేవతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు మంగళహారతులు పడుతూ, కట్నకానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భజనలు, కోలాటాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. కొత్తపల్లితో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రథోత్సవానికి జిల్లా డీఎస్పీ నాగేంద్రచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గంభీరావుపేట ఎస్సై అనిల్ తన సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.

