గుండెపోటుతో హోంగార్డు మృతి.. ఎస్పీ నివాళి
విధులు నిర్వర్తిస్తుండగానే కుప్పకూలిన సురేష్
కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా ఎస్పీ
కాకతీయ, కొత్తగూడెం: కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఆఫీసర్ సురేష్ శనివారం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఉదయం విధుల్లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో సహచర సిబ్బంది, కుటుంబ సభ్యులు కలిసి వెంటనే పట్టణంలోని అమృత ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆసుపత్రికి చేరుకుని సురేష్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎల్లప్పుడూ చురుకుగా ఉంటూ తన విధులను నిబద్ధతతో నిర్వర్తించే సురేష్‌ను కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. సురేష్ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని, బాధిత కుటుంబానికి శాఖా పరంగా అన్ని విధాలా అండగా నిలవాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

