విద్యుత్ షాక్‌తో ఐదు పాడి గేదెలు మృతి
పొలాల్లో నీటి కోసం వెళ్లిన సమయంలో ప్రమాదం
ఆదుకోవాలని బాధితుల ఆవేదన
కాకతీయ, చింతకాని: మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పొలాల్లో నీటి కోసం బావి వద్దకు వెళ్లిన ఐదు పాడి గేదెలు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో బాధితులు లక్షల రూపాయల మేర నష్టపోయారు. గ్రామానికి చెందిన రైతులు మేకపోతుల భారతమ్మ, వంకాయలపాటి వెంకటేశ్వర్లు తమ గేదెలను పొలాల్లో మేతకు తోలుకెళ్లారు. దాహం తీర్చుకోవడానికి గేదెలు బావి వద్దకు వెళ్లగా, అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదు గేదెలు మరణించాయి. తమకు జీవనాధారమైన పాడి గేదెలు మృతి చెందడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. సుమారు రూ. 3 లక్షల పైగా నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే తమ సంపాదన మూలమైన పశువులను కోల్పోవడంతో ఆ రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

