డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం
ప్రజావాణిలో దళిత మహిళ ఫిర్యాదుపై తక్షణ స్పందన
రెండు రోజుల్లో మాటిగేజ్ రుణంపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
బాధితులకు న్యాయం చేయకుంటే చర్యలు తప్పవన్న జేసీ శ్రీజ
కాకతీయ, ఖమ్మం బ్యూరో: దళిత మహిళ కుటుంబానికి రుణం మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించిన డీసీసీబీ బ్యాంకు అధికారుల తీరుపై జాయింట్ కలెక్టర్ శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో మాటిగేజ్ రుణానికి సంబంధించిన నివేదిక అందించాలని బ్యాంకు సీఈఓను ఆదేశించారు. ఖమ్మం నగరంలోని రమణగుట్టకు చెందిన కొరివి మేరీ ఇంటి అవసరాల కోసం కొత్త బస్టాండ్ సమీపంలోని డీసీసీబీ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం ఇవ్వాలని కోరారు. నాలుగు నెలలుగా బ్యాంకు ఉద్యోగులు తిప్పుకుంటున్నారని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన జేసీ సీఈఓను పిలిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అయితే సంబంధిత అధికారులు ప్రజావాణికి హాజరుకాకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనకు అంగవైకల్యం ఉందని పలుమార్లు తెలిపినా ఫీల్డ్ ఆఫీసర్, బ్యాంకు మేనేజర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పట్టించుకోలేదని మేరీ భర్త కొరివి ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆర్థిక పరిస్థితిని వివరించినా బ్యాంకు చుట్టూ తిప్పించుకున్నారని తెలిపారు. జేసీ స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఇతర దివ్యాంగులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

