ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
బల్దియా అధికారులకు అదనపు కమిషనర్ ఆదేశం
ప్రజావాణికి వచ్చిన అర్జీలు 88
కాకతీయ, వరంగల్: నగర ప్రజల నుంచి గ్రీవెన్స్ (ప్రజావాణి) ద్వారా అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. నగరంలోని వివిధ సమస్యలపై ఈ వారం మొత్తం 88 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 48 దరఖాస్తులు రాగా, ఇంజనీరింగ్ విభాగానికి 13, రెవెన్యూకు 11, హెల్త్ & శానిటేషన్‌కు 08, నీటి సరఫరా విభాగానికి 08 చొప్పున వినతులు వచ్చాయి. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని అదనపు కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్ఓ డా. రాజేష్, హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

