ప్రమాదకరంగా విద్యుత్ తీగలు..
బిక్కాజిపల్లిలో జనం బెంబేలు!
నివాసాల మధ్య వేలాడుతున్నా పట్టించుకోని అధికారులు
కాకతీయ, దుగ్గొండి: మండలంలోని బిక్కాజిపల్లి గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. జనావాసాల మధ్య విద్యుత్ వైర్లు అత్యంత ప్రమాదకరంగా కిందికి వేలాడుతుండటంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ వైరు తెగి పడుతుందో, ఎవరి ప్రాణం పోతుందోనని స్థానికులు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామంలోని నివాస ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. ముఖ్యంగా వీధుల్లో చిన్నపిల్లలు ఆడుకునే చోట, వృద్ధులు నడిచే మార్గాల్లో ఈ తీగలు ఉండటం పెను ప్రమాదానికి సంకేతంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో ఈదురు గాలులు వీచినప్పుడు వైర్లు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యం వీడాలని విజ్ఞప్తి..
ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు రేఖంపల్లి ఏఈ సహా ఇతర విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని బాధితులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న తీగలను సరిచేయాలని, అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. పెద్ద ప్రమాదం జరగకముందే యంత్రాంగం మేల్కోవాలని బిక్కాజిపల్లి ప్రజలు వేడుకుంటున్నారు.

