కానిస్టేబుల్‌కు సీపీ నగదు రివార్డు
గంజాయి కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి
అభినందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ: వంద కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రాంపెల్లి ఉమేష్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్‌ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం కమిషనరేట్‌లో ఉమేష్‌కు సీపీ నగదు రివార్డును అందజేసి ప్రశంసించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భారీ గంజాయి అక్రమ రవాణా కేసులో దర్యాప్తు సంస్థ సేకరించిన సాక్ష్యాధారాలను కోర్టులో పక్కాగా సమర్పించడంలో ఉమేష్ కీలక పాత్ర పోషించారు. దీనివల్ల ఈ కేసులో ఐదుగురు నిందితులకు కోర్టు 20 సంవత్సరాల గరిష్ట జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
దర్యాప్తు, సాక్ష్యాల సేకరణే ముఖ్యం..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో పోలీసుల కట్టుదిట్టమైన దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ చాలా కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోర్టులో సాక్ష్యాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టడం వల్లే నేరస్థులకు శిక్ష పడుతుందని, తద్వారా పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఎల్లప్పుడూ ప్రోత్సాహకాలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు.

