రైతుల క్షేమానికి భూ వరాహయాగం
32 క్షేత్రాల పుట్టమట్టితో ప్రత్యేక పూజలు
కొమ్మాల ఆలయాన్ని సందర్శించిన డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి
కాకతీయ, గీసుగొండ: రైతుల సంక్షేమం, పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో ఏరువాక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో భూ వరాహయాగం నిర్వహించనున్నట్లు గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ అర్చకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి తెలిపారు. ‘గడపగడపకు నరసింహ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 32 లక్ష్మీనరసింహ క్షేత్రాల నుంచి సేకరించిన పుట్టమట్టి, ఏడు పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చిన జలాలతో భద్రాచలంలోని ఆశ్రమంలో ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యాగం పూర్తయిన తర్వాత ఏరువాక పౌర్ణమి నుంచి 40 రోజుల పాటు ఈ పవిత్ర మట్టిని రైతులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మట్టిని పొలాల్లో చల్లుకోవడం వల్ల భూసారం పెరిగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి విచ్చేసిన స్వామివారికి ఈఓ ప్రసాద్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఫణీంద్ర చార్యులు, విష్ణుచార్యులు, జూనియర్ అసిస్టెంట్ కనకయ్య మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

