ఉపా కేసులో బద్రి, రాజేందర్‌లకు విముక్తి
నిర్దోషులుగా ప్రకటించిన హనుమకొండ జిల్లా సెషన్స్ కోర్టు
సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టివేత
కాకతీయ, హనుమకొండ: కంచెర్ల బద్రి, దామెర రాజేందర్‌లపై నమోదైన ఉపా కేసును హనుమకొండ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసి, వారిద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపించడంలో విఫలమవడంతో ఆరోపణలు నిలబడవని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో పోలీసులు వీరిద్దరిపై మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారంటూ కేసు నమోదు చేశారు. అయితే, నిందితుల వద్ద లభించిందని పోలీసులు చెబుతున్న సాహిత్యం ఆధారంగా కేసు పెట్టడం చెల్లదని, అలాగే నిషేధిత జాబితాలో లేని సంస్థ పేరుతో కేసు నమోదు చేయడాన్ని ప్రతివాద న్యాయవాదులు కోర్టులో గట్టిగా ప్రశ్నించారు. ఉభయ పక్షాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం.. నిందితులపై మోపిన ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని పేర్కొంటూ వారిద్దరికీ విముక్తి కల్పించింది. తీర్పు అనంతరం కంచెర్ల బద్రి, దామెర రాజేందర్లు హర్షం వ్యక్తం చేస్తూ.. చివరకు సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించారు.

