పల్టీ కొట్టిన అక్రమ ఇసుక ట్రాక్టర్
ఆకేరు వాగు బ్రిడ్జి వద్ద ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
కాకతీయ, నెల్లికుదురు: తొర్రూరు – మహబూబాబాద్ ప్రధాన రహదారిపై నెల్లికుదురు మండలం కాచికల్లు శివారులోని ఆకేరు వాగు బ్రిడ్జి వద్ద మంగళవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ట్రాక్టర్ రామన్నగూడెం గ్రామానికి చెందినదిగా ప్రాథమిక సమాచారం అందింది. ఎలాంటి భయం లేకుండా, మితిమీరిన వేగంతో మైనర్ యువకులతో ఇలాంటి ట్రాక్టర్లను నడపడం ఇక్కడ పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికంగా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాను అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

