పీడ విరగడైంది
జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం ముగియడంతో సంబరాలు
మునిసిపల్ కార్యాలయం మెట్లను పాలతో కడిగి నిరసన
సోషల్ మీడియాలో వీడియో వైరల్
కాకతీయ, వరంగల్ : పుప్పాలగుట్టకు కార్పొరేటర్ కుయుక్తుల నుంచి విముక్తి లభించిందని వరంగల్ నగరంలోని 36వ డివిజన్ ప్రజలు అభిప్రాయపడ్డారు. జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం స్థానిక డివిజన్ కార్యాలయం వద్ద కొందరు తమ నిరసన గళం వినిపించారు. తాళం వేసి ఉన్న మున్సిపల్ ఆఫీసు గది ముందు మెట్లను పాలతో శుభ్రం చేసి నిరసన తెలిపారు. బుధవారంతో పాలకవర్గం పీడ విరుగడైందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద గుమ్మడి కాయ కొట్టారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా కొనసాగిన స్థానిక కార్పొరేటర్ తీరును ప్రజలు తీవ్రంగా ఎండగట్టారు. పాలకవర్గం పోయిందని, ఇకనైనా స్పెషల్ అధికారుల పాలనలో నగరానికి మంచి జరగాలని ఈ సందర్భంగా ప్రజలు ఆకాంక్షించారు. కార్యాలయం మెట్లను పాలతో కడుగుతూ ప్రజలు చేసిన ఈ వినూత్న నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. పాలకుల తీరుపై ప్రజలు తమ అసంతృప్తిని ఈ విధంగా బయటపెట్టడం నగరంలో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ పరిధిలోని స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

