సాంస్కృతిక సారథిని ప్రగతి వైపు నడిపిస్తున్నాం
జూపల్లి కృష్ణారావు పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి
వార్షిక ప్రగతి నివేదిక పుస్తకావిష్కరణ
కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
కాకతీయ, హైదరాబాద్: పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథిని కూడా అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి వార్షిక ప్రగతి నివేదిక పుస్తకాన్ని గురువారం సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల గద్దర్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాది ప్రగతి నివేదికను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కళాకారుల వేతనాలను పెంచడంతో పాటు గత దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలను చేపట్టినట్లు వెల్లడించారు. కళాకారులకు డప్పుతో పాటు వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావడానికి సాంస్కృతిక సారథి కృషి చేస్తోందని పేర్కొన్నారు. కళాకారుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అవసరమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అధికారులకు నివేదిక ప్రతుల అందజేత
అనంతరం తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణి ప్రసాద్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి మంత్రి నివేదిక ప్రతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా సంఘం సభ్యులు ముచ్చర్ల దినకర్ పాల్గొన్నారు.

