ఉపాధి కూలీలకు రెండు పూటలా ముఖ హాజరు
గీసుగొండ ఎంపీడీఓ కృష్ణవేణి
అనంతారం, కొమ్మాల గ్రామాల్లో పనుల తనిఖీ
కాకతీయ, గీసుగొండ : ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు రెండు పూటలా ముఖ హాజరు (NMMS) నమోదు చేయడం తప్పనిసరి అని గీసుగొండ ఎంపీడీఓ కృష్ణవేణి స్పష్టం చేశారు. మండలంలోని అనంతారం, కొమ్మాల, విశ్వనాధపురం గ్రామాల్లో శుక్రవారం ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి, చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. కూలీల హాజరు పట్టికలను (మాస్టర్ రోల్స్) తనిఖీ చేసి, పని ప్రదేశంలో అందుతున్న వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కృష్ణవేణి మాట్లాడుతూ.. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు ఉదయాన్నే పనులకు హాజరై త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం పని చేస్తేనే రూ.307 పూర్తి వేతనం లభిస్తుందని వివరించారు. ఎన్ఎంఎంఎస్ యాప్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఫొటోలతో కూడిన హాజరు నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. మే 24వ తేదీ వరకు పని చేసిన కూలీలందరికీ వేతనాలు వారి ఖాతాల్లో జమ అయ్యాయని, ఈ విషయాన్ని గ్రామాల్లోని కూలీలకు తెలియజేయాలన్నారు. పని ప్రదేశాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు. అనంతరం పనులకు హాజరైన కూలీలకు ఎంపీడీఓ స్వయంగా అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ చంద్రకాంత్, టీఏ సత్యనారాయణ సింగ్, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

