గుప్త నిధుల కోసమే శివాలయం కూల్చివేత
కాంగ్రెస్ నేతలపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆరోపణలు
చారిత్రక ఆలయ విధ్వంసంపై విచారణకు డిమాండ్
కాకతీయ, ఖానాపూర్ : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రంలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన మట్టి కోట శివాలయం విధ్వంసం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ సాకుతో ఈ పురాతన ఆలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేయడం వెనుక గుప్తనిధుల వేట జరిగిందనే బలమైన అనుమానాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఖానాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య ఈ వ్యవహారంపై నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే బినామీ కాంట్రాక్టర్ల ద్వారా టెండర్లు వేయించి, ఉద్దేశపూర్వకంగానే చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. “తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన కాకతీయుల శిల్పకళా సంపదను కాపాడాల్సిన పాలకులే వాటిని నేలమట్టం చేయడం దురదృష్టకరం” అని వారు పేర్కొన్నారు. పాఠశాల నిర్మాణానికి ఇతర ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆలయ స్థలాన్నే ఎంచుకోవడం వెనుక గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగాయని ప్రజల్లో చర్చ జరుగుతోందని వారు స్పష్టం చేశారు.
ఆర్కియాలజీ శాఖ గుర్తింపు ఉన్నా నిర్లక్ష్యమేనా?
గతంలో కేసీఆర్ హయాంలో సైనిక్ స్కూల్ ప్రతిపాదన వచ్చినప్పుడు ఆర్కియాలజీ శాఖ ఈ ప్రాంతాన్ని చారిత్రక కట్టడంగా గుర్తించిందని నాయకులు గుర్తుచేశారు. అప్పట్లో గుర్తింపునిచ్చిన అధికారులు, ఇప్పుడు ఆలయం కూల్చివేత జరుగుతుంటే జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆర్కియాలజీ శాఖ స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు విచారణ జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కాకతీయుల వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యతను విస్మరించి, స్వార్థ ప్రయోజనాల కోసం ఆలయాన్ని ధ్వంసం చేసిన కాంట్రాక్టర్‌పై, సహకరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, ఉపసర్పంచ్ ఉప్పు రాజు, మౌలానా, మచ్చిక అశోక్, యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

