నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
బిజీ-3 వంటి నిషేధిత పత్తి విత్తనాల విక్రయంపై కఠిన చర్యలు
తనిఖీల కోసం రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్
నిందితులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడేలా క్రిమినల్ కేసులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాకతీయ, భూపాలపల్లి : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ ఎరువుల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. ముఖ్యంగా బిజీ-3 (BG-3) వంటి నిషేధిత పత్తి విత్తనాల విక్రయం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. వానాకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయించే ముఠాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ (PD Act) కింద చర్యలు తీసుకుని రెండేళ్ల వరకు జైలుకు పంపిస్తామని తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి మండలంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఫెర్టిలైజర్ దుకాణాలపై నిరంతర నిఘా
జిల్లాలోని అన్ని ఫెర్టిలైజర్ దుకాణాలు, గోదాములలో టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు ఎస్పీ సంకీర్త్ చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేని, లూజ్ విత్తనాలను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయిస్తామన్నారు. నకిలీల బారిన పడి నష్టపోకుండా రైతులు కూడా కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, విత్తనాలు కొన్న రశీదులను భద్రపరుచుకోవాలని సూచించారు. జిల్లాలో ఎవరైనా రహస్యంగా నిషేధిత విత్తనాలు లేదా నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో గానీ, జిల్లా పోలీస్ అధికారులకు గానీ ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

